కాఫీ విత్..ఆర్.రమాదేవి పొయెట్రీ..461-ఎ.రజాహుస్సేన్


ప్రేమకవితల కవయిత్రి " ఆర్.రమాదేవి" కలం
నుంచి వచ్చిన మరో  'ప్రేమ' కవితఇది.

ఆమెకు Comfort గా వుండే   జానర్లోనిదే ఈ   కవిత కూడా..
ఈరోజు కాఫీ టైమ్లో ముచ్చటించుకుంటున్న  ఈ కవితను మీరూ ఓసారి చదవండి..!!

*ఒక్కసారి పరికించి చూడు.......

చిక్కని చీకటి
వెలుతురు చిమ్ముతుంది...
నీలి ఆకాశం నేల దిగివచ్చి
మెత్తని తివాచీ అయింది..

చుక్కలు ఒకటి ఒకటిగా
అతిథులుగా విచ్చేసి
నా చుట్టూ చేరి కబుర్లు
చెబుతున్నాయి...

అంతర్వాహిని ఒకటి
చప్పుడు చేయక
చెంత చేరింది ...

సీతాకోకచిలుకల గుంపు
తన రంగులు విదిల్చివెళ్ళింది...
అందరూ
వింతలు విడ్డూరాలు అంటున్నారు

ఏమోయ్.!
నిజం చెప్పు….
నీవు వచ్చి వెళ్లావు కదూ.. !
కొన్ని ఆనవాళ్లు దాచి వెళ్ళింది
ఇక్కడే కదూ…!

      *ఆర్.రమాదేవి.!!

అతడు వస్తూ వస్తూనే వసంతాన్ని వెంట తెస్తాడు.అప్పుడు  సృష్టిలో జరగరాని వింతలన్నీ జరుగుతాయి..ఆ మాటకొస్తే ….
ప్రాకృతిక…విరుద్ధమైన అద్భుతాలు కూడా వాటంతటవే జరిగిపోతాయి..అతడంటే ఆషామాషీ కాదు కదా.‌! అతడామె మానస
చోరుడు..

అతడున్నాడన్నది ఎంత నిజమో? లేడన్నది కూడా అంతే నిజం..అతడు భావనాత్ముడు.ఆమె మనసులో పచ్చి జ్ఞాపకంలా
మిగిలిపోయాడు.

అతడామె ప్రియసఖుడు….
ప్రేమ తడితగిలిన చోటల్లా అతడుంటాడు.
అతడున్న చోటల్లా..‌అద్భుతాలు. జరుగుతాయి..!

ఆ అద్భుతాలేమంటే….?
*చిక్కని చిమ్మ  చీకటి వెలుతురు చిమ్ముతుంది"
నిజానికిది సాధ్యంకాదు.అయినా అతడొస్తే మాత్రం అసాధ్యమేం కాదు.
*నీలి ఆకాశం నేలకు దిగివచ్చి మెత్తని తివాచీలా పరుచుకుంది"
ఎంతో ఎత్తు అందనంత దూరంలో వుండే ఆకాశం నేలకుదిగిరావడమేంటి? 
పిచ్చి కాకుంటేను..అసాధ్యమైనా,అతడొస్తే…మాత్రం ఈ పని సుసాధ్యమే..ఎందుకంటే..
అతడు మామూలు మనిషి కాదు..

ఆమె మనో వల్లభుడు మరి.
*చుక్కలు ఒక్కటొకటిగా,అతిథుల్లా విచ్చేసి,
ఆమె చుట్టూ చేరి కబుర్లు చెబుతాయి"!
ఆకాశంలోని చుక్కలేంటి? కిందకు దిగడమేంటి? అనుకుంటున్నారుకదా!
మీరనుకుంటున్నది నిజమే.. అతడొస్తే ఆమె కాశంలోని చుక్కలు కూడా  నేలకు దిగొచ్చి తివాచీలా పరుచుకొని అతడి కి స్వాగతం చెబుతాయి.
ఇక…
అతడొచ్చాడో ! లేదో..‌అంతర్వాహిని ఒకటి చప్పుడు చేయక ఆమె చెంత చేరింది …
అంతేనా?
*సీతాకోకచిలుకల గుంపొకటి  వచ్చి రంగులు విదిల్చివెళ్ళింది...దాంతో పరిసరాలన్నీ రంగు
ల మయమయ్యాయి...అతడికి స్వాగతం చెప్పడానికా ! అన్నట్లు, ఆ సీతాకోకల గుంపు తమ రెక్కల్లోని రంగుల్ని అక్కడ విదిల్చి… వెళ్ళాయి.
వీటిని చూసే వారందరూ..ఏమిటీ 'వింతలు'
'విడ్డూరాలు' అంటున్నారట…

అప్పుడామె‌..
తనమనసులో ఇలా అనుకుంది..
" ఏమోయ్….
నిజం చెప్పు….
నీవు వచ్చి వెళ్లావు కదూ.. !
తన మనస్సాక్షి ఎప్పుడూ అబద్ధం కాదు..
ఇదీ…అంతే…!
అవునూ…..
నువ్వొచ్చినప్పుడు…
వచ్చి వెళ్ళిన  'ఆనవాళ్లు' దాచి వెళ్ళింది
ఇక్కడే కదూ"అంటూ ఆమె అడిగితే,...

అతగాడి సమాధానం..
"అవుననే "….,
మరంతే కదా..!
అతడే ఒక అద్భుతం..
మరి…
అతడే వచ్చి వెళితే …
అద్భుతాలు జరగవా ఏమీ?
విరోధాభాస ఈ కవితకు అలంకారమైతే…
అతడొచ్చినపుడు జరిగినపరిణామాలు,
అద్భుతాలు..ఆమె ప్రేమకు ఆకారాలు…
అతడొచ్చి వెళ్ళాక మొలిచిన ఆకుపచ్చని శకునాలు..
ప్రేమంటే అంతే మరి….
ఎప్పుడూ…
అదో అద్భుతమే..!!

*ఎ.రజాహుస్సేన్….!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!